ఆపేక్ష
కొమ్మ తల్లి వొడిలో అప్పుడే కనువిప్పుకున్న తలిరాకు
పచ్చదనము పరుచుకున్న ప్రపంచాన్ని పరికించి
అందము ఆవురించెను అంతటా అనుకున్న అమాయకపాకు
వయసంతా వసంత కాలమే అని భ్రమసి మురిసిన మారాకు
విసురుగా వచ్చి తగిలిన వేడి గాలికి వులికిపడి
మున్నెనడూ చవిచూడని తాపమునకు జడిసిపడి
మొదటి మారు చావుదెబ్బను చవిచూసెనా ఆకు
కనికరము కానరాని గ్రీష్మ తీక్షణమునకు
పిడచ కట్టుకున్న గొంతులో గుక్కెడు నీళ్ళు కుమ్మరించిపోను
దివినించి దూకివచ్చిన కుంభవృష్టిని ఒడిసిపట్టుకోను
ఆకును దొన్నెను చేసి దోసిలితో ఆబగా దాహార్తి తీర్చుకోగా
నాడెన్నడో తల్లి చనుబాలని తలపునకు తెప్పించెనీ జలధార
వయసు మీద పడినంతలోనే కొలిమితో చెలగాటమాయే
చావుకు చేరువ అనుకున్నంతలో అమృతం కురిసి బతికిపోయె
కాస్త జవసత్వములను పుంజుకుని చుట్టూతా చూడగా
శరత్తు మహత్తుల మోజులలో లోకము మోహములో పడిపోయె
మొన్ననే కదా కనువిప్పుకున్నది, నిన్నే కడా వయసొచ్చి ఉన్నది
పుట్టినాట చెలగాటము, ఎదుగు వేళ ఆరటము, పెరుగు క్రమములో పోరాటము
మూడు కాలాలలో ఆర్జించిన మూడు జన్మల అనుభవాన్నంతా
తలపులోకి తెచ్చుకుని ఆ జడిలో తడిసి ముద్దైపోవటమే లేత హేమంత శోభంతా
పండుటకుగా మారి రాలిపోవుటకు సిద్ధపడిన పిదపకాలము
అనుభవాలను గడించుకుందో లేక అనుభూతులని గుణించుకుందో
ఙ్ఞాపకాల బరువుతో కృంగి వార్ధక్యపు వయసులో కడతేరిపోతూ కూడా
శిశిరాములో తన స్థానే మరో చిగురుకు చేసిపోయింది చోటు సాయం
బ్రతుకు తీరింతే కాలము తీరంతే
ఆకు మొగ్గేసినా పూవు పండేసినా
నేడు రేపటికి నాంది, రేపు మరుసటికి పునాది
యుగాల తరబడి ఈ రూపాంతరమే యుగాది
No comments:
Post a Comment