చవితి

పొట్టివాడు


మూడడుగుల బుడతడికి ఏడ వచ్చెనో కదా

మీసకట్టు మొనగాళ్ళను ఎదిరించు మొండి ధైర్యం

విచిత్ర వేషభూషలతో వచ్చిన వానిని సైతం

గడప దగ్గరే నిలబెట్టి దాటనీయని వింత వైనం

చిన్న వాడవైనా ఇంటికి పెద్ద దిక్కు నీవేనని

చెప్పి పోయినా అమ్మ మాటాకా ఆ ప్రాధ్యాన్యం

అడిగిన తడవుననే ఆలోచించక వరాలిచ్చి

తల మీదకు తెచ్చుకునే తండ్రి పోలికదా ఆ జన్యం


కడుపు చించుకుని పుట్టకున్నా

పోలికలు దించుకుని ఎదిగినట్టున్న

పేరు లేని బాలుని సలిపిన పోరాటం

మొక్క సమము వాని మొక్కవోని తనమునకు నిదర్శనం


పసితనముననే ప్రాణము పణముగా పెట్టుట నేర్పెను

గండములు ఎంతటివి ఐనా ఎదురొడ్డి నిలుచు పరాక్రమమును

ఎడతెగక ఆటంకములు ఎదురు పడు ఉదంతములు నేర్పెను

కంటకములు తొలగించుకుంటూ ముందుకే సాగు పట్టుదలను

పరివిధములుగా పరులు నవ్విపోవు లోక రీతులు నేర్పెను

నమ్ముకున్న దాని మీద నగుబాటు నీడలు సోకలేవను వివేకమును


కదలడు, ఎవ్వరెదురైనా

వదలడు, పట్టినది ఏదైనా

అదరడు, సమస్య ఎంతటిదైనా

బెదరడు, ఒంటిగ నిలిచినా

చిన్న పాపడు, ఈ గణపడు

No comments: