కోర్పరేట్ వ్యవస్థ చెప్పుచేతల్లో ప్రభుత్వపు పని తీరుతెన్నులు. ఉద్యోగ సృష్టికర్తలు అన్న గండపెండేరం తొడిగి, ప్రభుత్వపు పందేరాలలో వారికి పెద్ద పీట వేసి, వడ్డించే వాడు మనవాడే అయితే అన్న చందాన వారి పెట్టుబళ్ళకు ప్రతిగా ప్రభుత్వ పెట్టిపోతలు. పన్ను భారాలతో, మౌలిక సదుపాయాల లేమితో అసలే బక్కచిక్కి మూలుగుతున్న దిగువ తరగతి ప్రజానీకం యొక్క ఆకలి తీర్చడానికి అన్నట్టు ఉదారవాద ప్రభుత్వం అతి ఎత్తు నుండి అప్పుడప్పుడూ జారవిడిచే తాటి పళ్ళు. కోర్పరేట్ లాభల పేరుతో పొరుగు దేశాలకి వలస పోతున్న ఉద్యోగాల ప్రవాహాన్ని అడ్డుకోలేక, ఆర్ధిక భద్రత కోసం, మంచి భవిష్యత్తు కోసం అప్పుడే దేశం లోకి అడుగు పెట్టే వలసదారుల మీద స్థానికులకు పెల్లుబిక్కిన ఆగ్రహం. వచ్చిన దారినే మళ్ళిపోవాలని నిరసనలు, బెదిరింపులు, కొండకచో హింసాత్మక హెచ్చరికలు. జాతుల పేరిట ఆగని సంఘర్షణలు. మహిళల హక్కులలో, ప్రముఖంగా ఉద్యోగ విధి నిర్వహణలో, లోపించిన సమతుల్యత --- ఇవన్నీ చదువుతుంటే ఏ 20వ శతాబ్దపు నాగరిక సమాజ జీవన పరిస్థితులగానో, లేదా ఒక అడుగు ముందుకు వేసి 21వ శతాబ్దమో జీవన స్థితిగతులగానో పొరపడడం కద్దు. ఇవే వాక్యాలు 18వ శతాబ్దానికి, ఆ తరువాత 19వ శతాబ్దానికి కూడా అచ్చుగుద్దినట్టు అమరుతాయి అని తెలిస్తే, నాగరితపు నడక ముందుకా, వెనకకా, లేదా ఉన్న చోటే అడుగు వేస్తూ పురోగతని ఏమారుస్తోందా అని అనుకోవడం సహజం. మరి ఈ 300 యేళ్ళలో మార్పు ఏమీ లేదా అంటే, ఉంది, ఖచ్చితంగా ఉంది - ఫాక్టరీ పొగ గొట్టాల సంఖ్య పెరిగింది, అందులో పని చేసే వారీ సంఖ్యా పెరిగింది, అలా అని కార్మికుల జీవన ప్రమాణాలు మారినాయా? పెట్టుబడిదారి వ్యవస్థ వేలు పెట్టని చోటు లేని విధంగా అభివృద్ధి పేరిట సహజ వనరుల సిరులని కొల్లగొట్టి వాటి పునాదుల మీద కోర్పరేట్ వ్యవస్థ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు పెరిగినాయి, అవే సహజ వనరులని తరతరాలుగా నమ్ముకుని, వాటి అదృశ్యంతో ఇక ప్రత్యామ్న్యాయ అవకాశాలు లేక పట్టణాలకు వలస వచ్చి అవే ఆకాశ హర్మ్యాల నిర్మాణాలకి రాళ్ళేత్తే కూలీలుగా అవతరించే ప్రజానీకం కుశలాల మాటో? ధనం పేరిట, మతం పేరిట, రంగు పేరిట, రాజ్యం పేరిట, స్థానికత్వం పేరిట, వలస వాదం పేరిట, ఎన్నో శతాబ్దాలుగా కింద తరగతి ప్రజలు పావులుగా విభజించబడి, ఒక్కొక్కరూ ఒక్కో గడిలోకి నెట్టబడి, వారి చేతిలో ఆయుధాలు పెట్టబడి, వారితోనే, వారి మీదే, వారిని వాడుకునే సాగే ఈ వ్యవస్థీకృత వికృత చదరంగాన్ని నడిపించే అసలు చేతులు ఎప్పుడూ మారలేదు. ఇంతవరకూ ఏ పొట్ట పెరిగి పోయిన పెట్టుబడిదారీ తనకు తానుగా మనసు మార్చుకుని, లాభన్ని పక్కకి నెట్టి, పొరుగు వాడి బాగులోనే తన మేలు కూడా ఉన్నదన్న ప్రాధమిక సూత్రనికి కట్టుబడి, తన విశాల వ్యాపార సామ్రాజ్యంలో అన్ని తరగుతుల ప్రజలని (తన పని చేసే వాళ్ళైనా సరే) కలుపుకు పోయిన పాపాన పోలేదు. పంచడం అన్నది ఒక పాపంగా, ఒక మానసిక రోగంగా, అందినంత అందుకోవడమే, కాకుంటే కొల్లగొట్టటమే పునాది రాళ్ళుగా నిర్మింపబడిన నవ నాగరిక అమెరికా సమాజము యొక్క ఓపెన్ హార్ట్ సర్జరీయే ఈ పుస్తకం . ఆ దేశం "ఆవిర్భవించిన" 1492 నుండి, అంటే నాటి కొలంబస్ నుండి నేటి డోనాల్డ్ ట్రంప్ వరకూ, కేవలం పాత్రల పేరు మార్పుతో, వివిధ కాలాలలో, జరిగిన అవే కధల, అవే వెతల సమగ్ర సంకలనమే ఈ "A People's History of the United States"
అనగనగా ఒక అనచ్ఛాదిత ప్రాంతం. కనుచూపు మేర ఎటువైపుకూ అంతే కంపించని బయళ్ళు, నదీనదాలు, హిమవన్నగాలు, యేళ్ళు, సెలయేళ్ళు, జలపాతాలు, వాటి మీద భీతి లేకుండా సంచరిస్తూ, సహజీవనం చేసే పశు జాతులు, మనుష్య సంతతులూ. అవసరం మేరకే వ్యవసాయం, ఆకలి కోసమే వేట. ప్రకృతి అందించినవి మహా ప్రసాదంగా స్వీకరించి పొట్ట కోసం తప్ప కొల్లకొట్టడం అనే ఊసు కూడా తెలియని స్థానిక "ఇండియన్" జాతి. అది 1492. మూడు ఓడల మీద ముల్లోకాలు జయిద్దామని (కాదు... కొల్లగొడదామని) బయలుదేరిన కొలంబస్ మూఠాకు వక్రమైన విధి రాత వల్ల, గుండ్రమైన భౌగోళిక రూపు వల్ల తారసిల్లిన ప్రాంతాలు, మొదట కేరీబియన్ ద్వీపాలు, ఆ బాటనే మీదుగా ఉన్న నేరానికి అమెరికా దేశం. ఈ ప్రాంతానికి, ఆయన యానానికి ఆ తరువాత కాలం శ్వేత జాతి దిద్దుబాటు చరిత్రకారులు పెట్టుకున్న ముద్దు పేరు - "న్యూ వరల్డ్" (కొత్త ప్రపంచం). 15వ శతాబ్దం నాటికి ఐరోప దేశాలు చీకటి రోజుల నుండి అప్పుడప్పుడే బయట పడుతూ తమ రాజ్య ధన దాహాలను తీర్చుకోవడానికి సాహసికులైన అన్వేషకుల ప్రపంచ యాత్రలను ప్రోత్సహించడం మొదలు పెట్టినాయి. అప్పటికే వేల యేళ్ళ చరిత్రలు, వృద్ధి చెందిన నాగరికతలు వర్ధిల్లుతున్న తూర్పు వైపు దృష్టి సారించి, యాత్రకు పెట్టిన రూపాయి పెట్టుబడికి వందింతలు ఎవరు ప్రతిఫలాలు అందచేస్తారో, వారికి సూదిమొన శాతం వాటా ప్రకటించి బరిలోకి ఉసికొల్పినాయి. ఒక వైపు ధన దాహంతో దూసుకు వస్తున్న పడవలు, మరొక వైపు "సొంతమైన", "వ్యక్తిగతమైన" అన్న పదాలే తెలియని సమిష్టి వ్యవస్థలు. ప్రపంచ ఆర్ధిక మూలాలను కుదిపేసిన, అర్ధ సిద్ధాంతాలను తిరగరాసిన విస్ఫోటాత్మక ఘటన జరిగిన యేడాది 1492. పెట్టుబడికి రాబడే అంతిమ లక్ష్యంగా, ఆ రాబడిని రాబట్టేందుకు మనిషి మాన, ప్రాణాలను సమిధలుగా చేసి వేలార్చిన ఈ కనకధారా యఙ్ఞంలో, సాటి మనిషి దురాశకీ, దౌర్జన్యానికీ, దోపిడికీ బలయిపోయి చివరికి పూర్తిగా అంతరించి పోయిన స్థానిక జాతుల కళేబరాల మీదా, కపాలాల మీదా కట్టబడిన ఈ "న్యూ వరల్డ్", పెట్టుబడిదారీ వ్యవస్త యొక్క తొలి మూలాలూ, పునాదులూ ఉన్నవి స్మశానాల మీదా, ఎండిన రక్తపుటేళ్ళ బీళ్ళ మీద అన్న విషయం అనుక్షణం గుర్తుచేస్తూ ఉంటుంది. 1492 నుండి అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న 1776 వరకూ జరిగిన స్థానికుల నరమేధను యేళ్ళ వారిగా, దశాబ్దాల వారిగా, శతాబ్దాల వారిగా పరిశీలిస్తే, అతిధులుగా వచ్చిన వారిని చేరదీసి ఆశ్రయమిస్తే వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, మొదట బంగారం కోసం, తరువాత భూమి కోసం, అటు తరువాత బానిసల కోసం, ఎడారిలో ఒంటె గుడారం కథ చందాన, స్థానికతను క్రమక్రంగా ప్రక్షాళన చేసుకుంటూ పోయి, చివరికి అమెరికా గడ్డ పై పూర్తిగా తమ సార్వభౌమత్వాన్ని ఈ ఐరోప దేశాలు ఎలా చాటుకున్నాయో చదువుతూ ఉంటే, గుర్తువచ్చే వరసలు ఇవే - "ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరంగ ప్రవాహిసిక్తం". ఆ రెండు వందల యేళ్ళ పైబడి జరిగిన దురాక్రమణలో ప్రాణాలు కోల్పోయిన కోట్లాది స్థానికుల ఉసురు, పొయటిక్ జస్టిస్ గా, ఐరోప వాసులకీ, అటు తరువాత అమెరికా వాసులకీ తగిలిన ప్రతిఫలం - స్థానికులు వలస వాదులకు తగిలించిన పొగాకు.
చరిత్ర అంటే ఫలానా దేశపు దండయాత్రలూ, ఆ రాణీ రూపురేఖా విలాసాలు, ఈ రాజు కీర్తిగానాలా అని కవి వాపోయినట్టు, మళ్ళీ దానిని సమర్ధించుకుంటూ సామెతలు కూడానూ - చరిత్ర అన్నది విజయుల వీరగాధలే అని. జిన్ అందుకు భిన్నంగా తన చూపుని వ్యవస్థ నిర్మించిన హర్మ్యాల వైపు కాక, గుండె మంట నెగళ్ళలో రాటు దేలిన ఎర్రని ఇటుకల వైపు, అణగదొక్కిన జాతుల వెన్నుల మీద నిలిపిన ఇనుప వాసాల వైపు, బలహీనుల రక్తంతో చెమటతో కన్నీళ్ళతో తడిని బలపడిన స్థంబాల వైపు సారిస్తాడు. ఆ మాటని నిర్ద్వంద్వంగా ప్రవేశికలోనే ప్రకటిస్తాడు - చదువరులూ, ఈ పుస్తకంలో మీ దేశభక్తిని ఉద్రేకపరిచే అంశాలు ఏమీ ఉండవు, ఏమన్నా ఉన్నాయి అంటే మొట్టమొదటి పునాది రాయిగా పడ్డ సంస్థల/వ్యవస్థల దురాక్రమణ తత్వం నుండి, ప్రస్తుతం పెట్టుబడిదారీ సిద్ధాంతానికే తార్కాణంగా ఎదిగిన ఈ రాజప్రసాదపు ప్రతి ఒక అంతస్తు నిర్మాణం వెనక దాగి ఉన్న చీకటి కోణాలే అని. ఇది వెలిగిన కాదు, ఒక నలిగిన కథ. మిగతా దేశాల పుట్టుపూర్వోత్తరాల వలే కాక, అమెరికా దేశ చరిత్ర చాలా భిన్నమైనది, ఒక విధంగా ప్రపంచం కళ్ళ ఎదుటే 500 యేళ్ళ క్రితమే ఊపిరి పోసుకున్న పసికూన. దాని బోర్ల పడడం నుంచి, బుడి బుడి నడల గుండా, క్రమక్రమేపీ ఆ దేశం ఎదుగుదల ప్రపంచానికి సుపరిచతమే. ఇందులో దాచే విషయాలు ఏమీ లేవు, మసి పూసి ఏమార్చే అంశాలు అంత కన్నా లేవు. కొలంబస్ చూపించిన దారిలోనే - ఉపమానంగానూ, ఉన్నదున్నట్టుగానూ - ఆ తరువాత ఎదిగిన సమాజం, అడుగులు తప్పకుండా, దోచుకో-దాచుకో సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్ముకుని అంచెలంచెలుగా ఎలా విస్తరించిందో, ఎక్కడో అమెరికా తూర్పు తీరానికి ఐరోప దేశాల నుండి మత విద్వేషం తప్పించుకోవడానికి శరణార్ధులై వచ్చిన వాళ్ళు, ఒక్కక్కరూ దురాక్రమణ దారులై "ఇండియన్"లను వారి అఙ్ఞానం, తమ ఆధిపత్యం, వారి అమాయకత్వం, తమ అవకాశవాదం, వారి నిస్సహాయత, తమ అమానుషత్వం, వారి ఉదాసీనత, తమ చట్టబద్ధతలతో ఒక్కో అడుగు వీరు వేసుకుంటూ ఒక్కో ప్రాంతం నుండీ వారిని జరుపుకుంటూ, ఒక రెండు వందల యేళ్ళ కాలంలో వలస పేరుతో వచ్చిన వారు విస్తరణ పేరుతో ఎలా ఆక్రమించుకుంటూ పోయి చివరికి వారి దేశంలోనే వారికి నిలువ నీడలేకుండా చేసారో గమనిస్తే, సామ్రాజ్యవాదం అన్నది రాచరికపు జన్మ హక్కు కాదనీ, అవసరం-అవకాశం-ఆయుధం సమపాళ్ళలో కలిస్తే ప్రతి సామాన్యుడిలోనూ ఒక సామ్రాజ్యవాది దాగి ఉంటాడని, కాలం కలిసిరాగానే పడగలు విప్పి బుసలు కొడతాడని, దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఊచకోతకు గురికాబడిన విబ్భిన్న "ఇండియన్" జాతులు ముక్త కంఠంతో ఆక్రోశిస్తాయి. ఈ ప్రక్షాళన పనులను మతం పేరుతో సమర్ధించుకుంటూ, చట్టం పేరుతో శాసనాలు చేస్తూ, ఆవిర్భావమే ఒక దమనకాండ మీద జరుపుకున్న దేశం ఆ తరువాతి కాలాల్లో హింసావాదాన్ని పూర్తిగా వదిలి పెట్టి శాంతి మంత్రాలను (కొంగ) జపం చేస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే. స్థానిక "ఇండియన్" లను పూర్తిగ మట్టిగరిపిన తరువాత ఆ మట్టిని సాగు చేయడానికి ఎంచుకున్న తరువాతి తెగ - ఆఫ్రికా నుండి బందీలుగా తేబడి బానిసలుగా పని చేయబడిన నల్ల జాతీయులు. ఆధునిక చరిత్రలోనే బహుశ మరే జాతీ చవిచూడనంత కౄరత్వం రెండు వందల యేళ్ళ పాటు పంటి బిగువున భరించి, "ఇండియన్"ల బూడిదలతో పరిపుష్టమైన అమెరికా నేలని తమ రక్తం మాంసాలతో చదును చేసి నివాస యోగ్యం చేసి శ్వేత సౌధాల్ని నిర్మించి, దేశానికి ఒక రూపు తెచ్చిన అసలు అవిశ్రాంత విశ్వకర్మలు, ఈ నల్ల జాతీయులు.
వివక్ష అన్న ఇంటి పేరుతోనూ, విషాదం అన్న వంటి పేరుతోనూ అమెరికాలో రెండు వందల యేళ్ళ పాటు నల్ల జాతీయులు తమ జాతి చరిత్రను తెల్ల పుటల మీద ఎర్రని అక్షరాలతో రాసుకున్నారు. సూర్యుడు ఒకింత తము పుట్టింటి దేశాల మీద ఎక్కువ ప్రేమని కురిపించిన పాపానికి, పరిణామ క్రమంలో ఆ యెండ బారినుండి తప్పించుకోవడనికి వంటి చాయ కాస్త ఎక్కువయిన (నలుపు అన్నది రంగు ఎక్కువయినదువల్ల, తక్కువయినదువల్ల కాదు) నేరానికి, శ్వేత దేశాల వలస వాదులు రంగు అనేది తమకు దైవ క్రమంగా లభించిన హక్కుగానూ, వారికి అదే చేయి వల్ల సంప్రాప్తించిన శాపంగానూ చూపించి, వారి దేశాలని ఆక్రమించి, వీరిని పట్టి బంధించి సంకెళ్ళు కట్టి, పడవల్లోకి నెట్టి తమ దేశాలకి తరలించుపోయి, ఇక తరతరాల పాటు వారి చేత ఊడిగాలు చేయించుని, వారి సేవల మీద శవాల మీద తమ విలాసాలు, చిద్విలాసాలు నెరుపుకున్న వైనం, గుండె ఉన్న వాడు ఎవరన్నా గర్హించాల్సిందే, మానవత్వం ఉన్న వాడు ఎవరన్నా ఖండించాల్సిందే. 1970ల తరువాత నెమ్మదిగా విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో మెరుగవుతున్న నల్ల జాతీయుల పరిస్థితులను చూపించి నేటి జాతి దురహంకారులు, ఇంకా ఎంత కాలం వారికి ప్రత్యేక హోదాలు, బుజ్జగింపులు అన్న ఆరోపణలు వింటుంటే, 200 యేళ్ళ పూర్వం పడవల్లో అడుగు భాగాన వందల సంఖ్యల్లో ఇరుకుగదుల్లో, కూర్చునే మాట పక్కన పెట్టి సరిగా నుంచోవడానికి, గుండె నిండా గాలి పీల్చుకోవడానికి సైతం చోటు లేని విధంగా కుక్కబడి, సమ్రుదాల మీద ప్రయాణం చేసి, ఆ యానంలో తిండిలేమితో, రోగాలతో, కాన్పులతో, మతి చలించి పోవడంతో, కాలు మోపుకునే ఇంకాస్త చోటు కోసం కాస్త బలహీనంగా ఉన్న తమ వాళ్ళనే కింద వేసి తొక్కి చంపి పొందిన ఆ ఆరడగూ ఊరటతోనూ, నెలల తరువాత గమ్యం చేరినాక, ప్రాణాల్తో మిగిలిన వాళ్ళన్ని ఇళ్ళ వెనుక పశువుల కొష్టాల పక్కన కట్టిబడి ఉంచి, అవే పశువుల మాదిరిగా కొరడా దెబ్బలు తింటూ, వారి ఆడవారు ఇంటి యజమానుల కోరికలు అన్ని విధాలుగా తీరుస్తూ, పొలాల్లో నెమ్మదిగా పని నేర్చుకుని, ఆ రోజు పొలంలో ఏరిన పత్తి బరువు బట్టి వేసిన తిండి తింటూ, ఉండబట్టలేక తిరగబడితే చెట్టుకు కట్టి చర్మం ఊడిపోయేలా దెబ్బలు తింటూ, ఏ దేవుడు ఇలా మనిషికి విధి రాయగలడు అని కుమిలిపోతూ.....ఒక వంద యేళ్ళు.... వంద యేళ్ళు.... ఇలాంటి గంటలు, 24 సార్లు, ఇలాంటి రోజులు 365 సార్లు, ఇలాంటి యేళ్ళు 100 సార్లు... ఎన్ని తరాలు ఇలా ఊడిగాల్లో ప్రభువుల పాదాల కింద నలిగిపోయాయో, యజమానుల తరాలను పెంచి పోషించడంలో తమ తరాలు కడతేరిపోయినాయో, దేశం అని చెప్పబడుతున్న చిన్న శాతం శ్వేత సంపన్న వర్గం సేవలో తమ జీవితాలు తరించిపోయినాయో తెలుసుకుంటే... గత 50 యేళ్ళగా బెరుకు బెరుకుగా దొడ్డిలోంచి ఇంటి గడపలోకి కాలు మోపుతున్న నల్ల జాతీయుడికి ఇచ్చే ఈ కొద్దిపాటి ఊరడింపు, ఈ చిన్నపాటి ఆశ్వాసన, శతాబ్దాల పాటు వీపు మీద వేసిన కొరడా దెబ్బల చురకలను మాన్పగలదా, వందల యేళ్ళ పాటు కార్చి కార్చి బుగ్గల మీద ఎండిపోయిన రక్త కన్నీటి చారికలను తుడపగలదా? అబ్రహాం లింకన్ 1860ల కాలంలో చేసిన బానిసత్వ నిషేధ చట్టం వారి స్థితిని కాస్త మెరుగు పరిచి ఉండచ్చు కాక, కాని అక్కడ నించి లిండన్ జాన్సన్ 1960 ల కాలం లో చేసిన పౌరహక్కుల చట్టం వరకూ, మరొక వంద యేళ్ళు మరో అంతర్యుద్ధం. అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో, నల్లవారు ఇక తమ బానిసలు కారు అన్న వాస్తవాన్ని జీర్ణించులేని ప్రజ, యజమానులం కాకపోవచ్చు కాని పెత్తనం ఇంకా మాదే అన్న ధోరణిలో, నల్లవారిని దరి చేరనీయని, వారికి సమజంలో గౌరవం అందనీయని పద్ధతలు (సామూహిక భోజనశాలల్లో వ్రేలాడకట్టబడిన ప్రకటన - "కుక్కలు, నల్ల వారు ఇక్కడ నిషిద్దం"... ఇది 1960ల్లో....) పరికిస్తే, బానిసత్వం పోయిఉండచ్చు గాక, మనుషుల్లో కుంచితత్వం పోవడానికి ఇంకా కాలం పడుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఇంత కల్లోలభరితమైన చరిత్రకి జిన్ చూపే ఏకైక కారణం - స్వంత సొత్తు, వ్యక్తిగత ఆస్తి - పెట్టుబడిదారి వ్యవస్థకి బీజం, లాభం అన్న భావన కి ఆది మూలం.
కొలంబస్ 1500వ కాలంలో కేరీబియన్ ద్వీపాలలో చేసిన ధ్వంస రచన తరువాత, ఇక ఓడల బళ్ళు కట్టుకుని సముద్రాల మీద అలల మాదిరిగా అమెరికా తీరానికి ప్రవాహాల మాదిరిగా చేరడం మొదలు పెట్టారు ఐరోపా దేశీయులు, ప్రధానంగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్, డచ్, స్పానిష్ జాతీయులు. ఓడలు కట్టిన వాళ్ళు అంతా మారాజులు కారు, ఎక్కువ శాతం తమ దేశాల్లో కూటికి గతి లేని వాళ్లే, చెల్లని నాణేలే, దేశం మారితే అన్నా తమ తలరాతలు ఏమన్నా మారతాయేమో అన్న ఆశతో వచ్చిన కాందిశీకులే. తీరం చేరాక, సాదరంగా ఆహ్వానించిన "ఇండియన్"ల నేల మీదే కన్నేసి కాలంతరములో, ఈ చెల్లని చిల్లి కాణీలే, వందల ఎకరాలకు భూస్వాములై, ఆ భూములను సాగు చేయడానికి తమ దేశాల నించి మరిన్ని సత్తు కాణీలను దిగుమతి చేసుకోవడంతో పాటు, కష్టతర పనులకు తలఒగ్గని జాతిగా పేరు మోసిన ఆఫ్రికా జాతీయుల జుట్టు పట్టుకుని వారిని జట్టు కట్టుకుని, 1776 నాటికి, ఈ రెండు వందల యాభై యేళ్ళ కాలంలో పెట్టుబడిదారులుగా పడగలెత్తారు, ఆ చెల్లని నాణేల తరువాతి తరాలు. భూమి, పంట, దిగుబడి ఎప్పుడైతే పుష్కలంగా చేతికొచ్చి, తమ పూర్వీకులు వేసిన నావిక దారుల్లో తమ మాతృ దేశాలతో వర్తకం మొదలు పెట్టారో, క్రమంగా తమ ఆస్తులను కాపాడుకునేందుకు సమూహాలుగా ఏర్పడి, ఆ సమూహాలు సంఘాలై, సంఘాలు స్థానిక ప్రభుత్వాలై, ఆ ప్రభుత్వాల ద్వారా తమ పెట్టుబళ్ళకు అనుగుణమైన చట్టాలు చేసుకుని, వారి దురాక్రమణకు ఎదురుతిరిగిన "ఇండియన్" జాతులతో యుద్దాలు ఒక వైపు, సంధి ఒప్పందాలు మరొక వైపుగా, పూర్తిగా ఏకపక్ష ఏర్పాట్లు చేసుకుని, తమ పెట్టుబళ్ళను వందింతలు లక్షింతలు చేసుకోగలిగారు ఈ బజారు మనుషులు. ఇంతలో వీళ్ళ లాభాల మీద కప్పం పేరుతో పెత్తనం చేలాయించడానికి చూసిన బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి, యుద్ధంలో తమ మోచేతి నీటి మీద బ్రతుకీడ్చే బానిసలను, తమ నీడ కింద బ్రతుకులు వెళ్ళబోసే దిగువ తరగతి పని వారినీ యుద్ధ భూమిలోకి ముందుకు నడిపి, వారి బలపరాక్రమాల మీద స్వతంత్ర్యం తెచ్చుకోగలిగారు. ఇందులో అసలు విషాదమేమిటంటే, నల్ల జాతి బానిసలకు ఇంగ్లండు ప్రభువైనా వచ్చేదేమీ లేదు, ఇంటి ముందు యజమానైనా ఒరిగేది ఏమీ లేదు, తనకు కానిది, తన తలరాతని మార్చని ప్రభువు ఎవరైతే ఏమిటన్న ఆలోచన కూడా దరి చేరనీయక, తమ యజమానులకోసం వారి కప్పాల నుండి లాభల విముక్తి కోసం పోరాటాలు సలిపిన నిస్స్వార్ధ యోధులు, తెలివిలేని అమాయకులు ఆ బానిసలు. స్వతంత్ర్యం సిద్దించింది. తెల్ల దొరలకు ఆర్ధిక స్వేచ్చ లభించింది. ఇంక పెట్టుబడి-రాబడి-లాభాలే పరమావధిగా విస్తరణ సాగింది. పక్క దేశాల మీద యుద్ధాలు ప్రకటించి, వారి భూభాగాలని తమ రాష్ట్రాలుగా కలుపుకుంటూ, అప్పటికే దేశంలో మరుగైపోతున్న, ఒక మూలైపోతున్న "ఇండియన్" జాతుల దగ్గర ఉన్న ఆ కాస్త నేలను కూడా ప్రభుత్వ లాంచనాలతో లాక్కుని, వారితో "జరుగయ్యా... లేకుంటే ఉరికొయ్య" వ్యూహాలతో, 13 రాష్ట్రాలతో మొదలయిన దేశం పక్క శతాబ్దం నాటికి ఒకటి రెండు మినహా ఇప్పటి ప్రస్తుత రూపుని సంతరించుకుంది. ఈ విస్తరణ వెనుక లక్ష్యం ఒకటే - భూమి, పంట, ఖనిజం, వ్యాపారం, పెట్టుబడి, రాబడి. వంద యేళ్ళ క్రితం పెట్టుబడి దారులు, ఆ కాలం తిరిగే నాటికి దొరలయ్యారు. చమురు నిక్షేపాలని పక్క రాజ్యం నించి లాక్కున్న రాష్ట్రంలో కనుగొన్నాక, ఈ దొరలు అందులో పెట్టుబళ్ళు పెట్టి చూస్తుండగా ఇక ధనంతో పని లేని శాసకులయ్యారు. ఇక చెప్పేవాదిదే చట్టం, రాసేవాదిదే రాజ్యం. ప్రభుత్వం అన్నది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అన్న నానుడి వెనుక నిజ రూపం, పెట్టుబడి యొక్క, పెట్టుబడి కోసం, పెట్టుబడి చేతే ప్రభుత్వం అన్నది.
అక్కడి నించి ఇప్పటి వరకూ అమెరికన్ విధానం స్వార్ధం, స్వలాభం, స్వప్రయోజనం అన్న తారక మంత్రాల చుట్టూనే తిరుగుతూ ఉంది, దీనికి వారు కప్పుకున్న ఉన్నతమైన ముసుగు - స్వేచ్ఛ, స్వతంత్ర్యం, సంతోషాన్వేషణ.
రాజ్యాంగంలోని ప్రతి సవరణ వెనక అభాగ్యుల బలిదానాలూ, రక్త తర్పణలే... ప్రజా ప్రయోజనాల శాసనాల వెనక తిరుగుబాటు దాకా వెళ్ళిన ఉదంతాలే... దేశానికి సంబంధించని ప్రాంతలలో యుద్ధ సమీకరణల వెనక ఆర్ధిక ప్రయోజనాలే...
బైబిల్ లో ఒక సూక్తి - తండ్రుల పాప ఫలాలు పిల్లలకు తప్పని అహారాలు (the sins of the fathers are visited upon the children)... నేడు ఐరోపా లోనూ, అమెరికాలో ప్రబలుతున్న వైషమ్య ధోరణుల విష బీజాలు ఎప్పటివి? ఎక్కడ నాటినవి? ఎవరు నాటినవి?
మేడి పండు పొట్ట విప్పి అసలు రంగు బయట పెట్టిన ఉదంతం... కాదు, విషాదం... కాదు, విప్పిన ఙ్ఞాన నేత్రం, Howard Zin's "A People's History of the United States"
No comments:
Post a Comment