మార్పు
వార్ధక్యపు బరువుతో క్రితం పొద్దు నేల గుంకిన భానుమూర్తి
కేరింతలు కొట్టుకుంటూ మరు రోజు నెలబాలునిలా నింగికెగసినా
రాతిరి ముసురినంతనే స్వరపేటికలు సర్దిపెట్టిన పరభృత బృందం
కిలకిల కచ్చేరీలతో మరు ఉదయం మరల తీయని గొంతులు సవరించుకొన్నా
క్రీనీడలు సోకుతుండగానే తమ వాకిళ్ళు బిడాయించుకున్న పూల పూటకూళ్ళమ్మలు
తెల్లవారగానే తిరిగి మెత్తని కంచాలలో రోలంబాలకు రుచులూరు విందులు వార్చి వడ్డించినా
నాడెన్నడో కాల ధర్మము పేరిట వదిలిపోయిన వసంత పెనిమిటి రాక కోసము
తరువు తరుణులు పచ్చదనుముల అచ్ఛాదనములతో నిలువెల్ల సింగారించుకుని వేచి ఉన్నా
....
ఈ వర్ణనలూ వివరణలూ కల్పనలూ కవిత్వాలలో లేని దేని కోసమో వెదుకులాట
ప్రకృతిని చూపించి పరమార్ధాన్ని జొప్పించి అందనిదేదో అందుకోవలనే వెంపర్లాట
కాలభ్రమణం తీసుకొచ్చే మార్పులలో చెప్పిపోయే పాఠాలను కళ్ళతో కంటే
లేని శాశ్వతత్వము కోసం శ్రమించిపోయే స్వాంతనకు కాస్త సాంత్వనను అందించుకుంటాము
మావిచిగురు పులుపును తీయతేనియ పిలుపుగా మార్చిచెప్పే కోకిలల కళను చెవులతో వింటే
గుండెలో దిగులెంత దిగిమింగుకున్నా పెదవి మీద నవ్వు పులుకోమన్న కమ్మని పాఠాన్ని వినగలిగేమూ
మోడువారిన చెట్లు కాలక్రమేణ కొత్త పూతలు వేసే చక్రభ్రమణమును ఆకళింపు చేసుకుంటే
బంధాల చెరలను త్రెంచి అనుబంధాల తెరలను తొలగించే నిర్వాణ సూత్రమును అవగతము చేసుకుంటాము
సృష్టిలో పిపీలకమును నుండి బ్రహ్మాండము వరకు విస్తరించుకున్న ప్రాణికోటి పరికిస్తే
జీవి ఏదయినా జీవితము కొరకు ఆరాట పోరాటములే మనుగడకు మూలసూత్రమని తెలుసుకునేము
....
వచ్చిపోయే కాలాలలో పుట్టిగిట్టే జీవ రాసులతో బట్టగట్టిన పాఠము ఒక్కటే ఒకటి
మర్పే జీవనపు పరమార్ధము, అది తెలుసుకుని స్వాగతిస్తే కాగలము కాల గమనానికి వైతాళికులము
No comments:
Post a Comment