పల్లె పిలుపు
బిర్ర బిగిసిన యాంత్రిక జీవనపు కిర్రుకర్రుల నుండి దూరంగా
గిలిగింతలు పెట్టే కువుకువల కిలకిలల వైపు కదులుదాము రా
పంచభూతాలు ప్రదూషింపబడే ప్రదేశాల నుండి వేగంగా
ప్రాణవాయువే ఊపిరి పీల్చుకునే పచ్చదనం వైపు పరువులెత్తుదాం రా
గడియారపు ముళ్ళ అంకుశపు పోట్ల వత్తిళ్ళను తప్పించుకుని పోయి
పనిబరువుతో నేలనంటిన నడుములు తిరిగి సరిచేసుకుందాం రా
అన్నమన్న మాటకు అర్ధాలు మారిపోయిన కలగాపులగాన్ని వదిలి
అవని అందించే మెతుకు మురిపాన్ని అబ్బురముగా చూసివద్దాము రా
రేపటిని నేడే అందుకోవలానే ఆరాటాన్ని అణచుకుని
క్షణాల కన్నిటికీ విలువ కట్టే పల్లె వైపుకు పోదాం రా
ఈ పట్టు భూతల స్వర్గమేమీ కాదు, ఇదొక శ్రామికుల దుర్గం
నలుగు పడని రాతి బెడ్డలని బీట వారిన గట్టి బీళ్ళని
చెమట నీటితో చదును చేసి రుధిర ధారలతో సారము చేసి
పండించినవన్నీ విస్తారముగా వడ్డించి పెట్టిన పచ్చని విస్తరి ఇది
నేలలో నాటిన మొలక గింజగా ఇంటికి చేరే వరకు
అంతరాయాలను తట్టుకుంటూ అవాంతరాలను దాటుకుంటూ
పెంపు చేసే పరిస్థితులే ముంపు తెచ్చే ఉపద్రవాలవకుండ
కన్న తండ్రిగా రైతు పంటను కంటిరెప్పగా కాపాడుకుండే ఈ పట్టు
సేద్యకారుడు సైనికుడిగా మారి చేసే మాతృభూమి సంరక్షణము
పరువులెత్తి పోతున్న కాలాశ్వమునకు పగ్గాలు వేసి
తీరుబడిగా సేద తీరుమనే సాంత్వన దొరుకునిక్కడ
కాలము కాలాలుగా తీరి ఋతువులు మాసాలుగా మారి
సమకూరినదిక్కడ సమయానికి సముచిత స్థానము
విత్తనములు వనముగా విస్తరించుట వేగము వల్ల కాక
వేచి చూచుటందే వున్నదన్న వివరణ ఉన్నదిక్కడ
నాగరికత ఎదుగుదలకు మూలాలు వెదుకు వారికి
నగరాలకు నడిచిపోయిన అడుగుజాడలు నేటికీ చెరిగిపోలేదు ఇక్కడ
పలకరింపులూ పరిచయాలూ మృగ్యమైపోతున్న అధునాతనములో
చిన్న నాటి పాత నేస్తుని అరుపు తిరిగి గుర్తుకు తెస్తుందీ పల్లె పిలుపు
No comments:
Post a Comment