చీకటి
సృష్టి మొదలవక ముందు అస్థిత్వము అంధకారపు లోగిలే
బ్రతుకు ఊపిరి తీసుకునే మునుపు చుట్టూ వెలుగు సోకని కూడలే
తనువు సేద తీరను కను రెప్ప దుప్పటి కప్పితే చీకటే
మనసు నెమ్మదించను నిదుర దారిలో తోడు నడిచేది చీకటే
అంకురించిన నుంచి అంతరించే వరకు బ్రతుకు భాగస్వామి చీకటే
పదిరెండు గంటల పాటు దినపు అర్ధనారీశ్వరపు రూపు చీకటే
మనిషి మనికికి ఆవల చేయి వీడని చెలిమి చీకటే
దృష్టి సోకని చోట ప్రమిద వెలిగించు ప్రేరణ చీకటే
జీవితము పొడుగూతా అభయం ఇచ్చే చీకటిని చూసి ఎందుకా భయం?
నిప్పుకు కారణభూతం మార్పుకు సాక్షీభూతం నేర్పుకు ఉత్ప్రేరకం ఈ నిశీధి బంధం
శబ్దము భేదించలేని శూన్యం నుండి
వెలుగు ఛేదించలేని తిమిరము నుండి
మహావిస్ఫోటనతో ఆవిర్భవించిన మనుగడకు
ఈ లేమితనమే మూలము, ఉద్భవానికి ఇది ఉచ్ఛాటనా మంత్రము
వినీలాకాశంలో దివిటీల చమురు కరిగిపోయాక
ఉనికి ఆనవాళ్ళు ఒక్కొక్కటిగా చెరిగిపోయాక
అనంతమైన విశ్వంలో తిరిగి ప్రశాంతమైన నిశ్శబ్దం
సవ్వడి వెలుగుల పురుళ్ళకు వేదిక మరొక మారు సంసిద్ధం
దివ్వెల వరసులు కట్టి వెలుగుకు పట్టం కట్టే ఈ పండగ
చీకటి తండ్రి వెలుగుల కొడుకుని గని మురిసే పండగ
No comments:
Post a Comment