సంక్రాంతి

 మెట్ట వేదాంతం


విత్తు నుండి మొదలై ఎత్తు మొక్కగా మారేవరకు

పొంచి ఉన్న ముప్పులను తప్పుకుని ఏపుగా ఎదిగేవరకు

గాలి వాటున పోక గట్టి గింజగా గడప చేరేవరకు

చేట చెరుగులో మిగిలి కడుపుకు కూడుగా అందేవరకు

అన్నమనుకున్న దాని బాటలో అడగుడుగునా గండాలే 


నీటి చుక్క తక్కువైనా తగులాటమే ఎక్కువయినా ఎగసెక్కమే

మింటి ఉండ కన్నెర్రకు మాడిపోవటమే కనికరము లేక వాడి పోవటమే

నేల సారము పెరిగిపోతే క్షారమే తరిగిపోతే క్షామమే

పంచభూతాలు కూడి వస్తే పసిడి పంటలే పరాకున పోతే పస్తులాస్తులే

నేలను నమ్ముకున్న దానికి నికరముగా కనపడేవి అనుభవాల సిరులే


భూమికున్న విలువ "పొలము" అన్న లేదు

అమ్ముకున్న ఆదాయము అన్నము మొలిపించుటలో లేదు

అదృష్టానికిచ్చు ఆదరణ సమాజము కష్టానికి ఇవ్వదు

ప్రాణ ఆధారమైన సాగుబడికి సాగిలపడక

అర్ధమే పరమార్ధమనుకునే వింత లోకమిది!


అనిశ్చితాలు ఆలుబిడ్డలు కష్టనష్టాలు తోబుట్టువులు

వ్యయప్రయాసలు చుట్టపక్కాలు అప్పుసొప్పులు మిత్రబృందాలు

పేరుకు పడగలెత్తిన భూస్వామి ఎకరాలకు ఆసామి 

నడి సంద్రపు నావికుడిలా చుట్టూతా నీళ్ళే కాని ఎప్పుడూ తడవని గొంతే

మట్టి కోటల రాజే రైతు ఎండిపోయిన బీళ్ళకు రైతే రాజు 


No comments: