వినాయక చవితి

 శృతిలయలు


ఆది స్వరము షడ్జమము మాతృత్వమును మొలిపించు

శిశువునందిన ఆరాటము రిషభమై కదముత్రొక్కు

మునుపు ఎరుగని గాంధారము మమకారమును మేల్కొలుపు

కుదుటపడిన మధ్యమాన అనురాగము అంకురించు

పంచ ప్రాణాల సమము పంచమమై ప్రవర్ధిల్లు

తనుకు మారు తన కుమారు దైవతముగా భాసిల్లు

స-అంతులేని విషాదము నిషాదమున అంతమగు

సప్త స్వర ఆరోహణన అమ్మతనము అందుకొనె

శృతికి సూత్రమైన తల్లి పాత్రన పార్వతి


నడకలో నిలకడకు తప్ప వేరు తావులేదు

నడతలో నిబద్ధతకు మించిన గురువు లేదు

తల్లి వంటి శృతిలో తప్పొప్పులున్నా గుణమెంచకున్నా

తండ్రి వంటి లయలో తప్పటడుగులున్న విషయమే సున్న

అనుగ్రహముతో పదము కుదురుగా కదిలితే లాస్యం

ఆగ్రహములో అడుగు తీవ్రతమమైతే తాండవం

పరవశములో లాస్యమాడితే జగితికి క్షేమము

ప్రకంపనల తాండవముతో తప్పదు క్షామము

తననే ఉదహరించి నడవడికను నేర్పె

లయకు లయముకు తేడాలు తెలిపి అనంతలయుడు

No comments: