సంక్రాంతి

సమిష్టి

మబ్బు దుప్పట్లు తీయ నిరసించిన బాల భానుడు
మంచు చీకట్లు తరుమ తత్సారము చేస్తుంటే
చల్ల అంబలి బొక్కి కొడవళ్ళు బట్టి శ్రామికులు
చద్ది మూటలు గట్టి చేల వైపు వెడుతుంటే
గింజ బరువుతో తలలు వాలిపోయిన వరికంకులు
భారమందుకోను ఆపన్నహస్తములకై చూస్తుంటే
జానపదాల ఊపుతో బారులు తీరిన భూపతులు
కత్తికో వేటుగా వరివైరుల తలలు తెగ్గోస్తుంటే
నారుమళ్ళ నుండి నూర్పిళ్ళ వరకు
చేతులన్ని కలిసిన మహా సందోహమిది

వేకువకు వంది వల్లించు తొలి కోడి
బుట్ట బయటికి రాక బుట్టబొమ్మలా కూర్చునుంటే
వెన్ను వణికించు చలిపులికి వెరయక
పారాణి పదాలు వాకిట వైపు అడుగులు వేస్తుంటే
కీచురాల రాగాలికి అందెల తాళాలతో
గాజుల గుంపులు గలగలల కచ్చేరి పెడుతుంటే
చిమ్ములాటల గిలిగింతతో కళ్ళాపి చల్లింతతో
ముంగిలికి ముగ్గులతో ముత్తైదవతనము తెచ్చిపెడుతుంటే
వీధి కున్న ప్రతి వాకిలికీ వెలుగులందీయ
చేతులన్ని కలిసిన మహా సమూహమిది

No comments: