శ్రీరామనవమి

మాయ


నునుపు చెక్కిళ్ళ కౌమార శోభలో
గాధేయ సారధ్యములో దైత్య పరివారమును
మరలకుండు విధముగ మట్టుపెట్టి
యాఙ్ఞికుల జన్నములు కాపాడు కధలు
వీనులారంగ నువ్వు వినలేదా?
అటువంటి విక్రముడా విహ్వలుడై హాహాకారమ్ములు చేసెడిది?

నూనూగు యవ్వన నూత్న ప్రాయమున
కౌశికుని కనుసన్నల ఆమోద ఆఙ్ఞలతో
అలవికాని బరువును ఆలవోకగ ఎత్తి
శరాసనమును విరిచి నిను వరించిన ఘట్టము
కన్నులారంగ నువ్వు కనలేదా?
అటువంటి పరాక్రముడా పరువులెత్తలేక ఆపసోపాలు పడునది?

ప్రేమాతిశయముతో వలచి వచ్చిన పడతిని
మర్యాదపూర్వకముగా తిరస్కరించిన తప్పుకు
మీదపడిన ముష్కర మూకలను తిప్పికొట్టిన తెగువను
పారు సెలయేరుకు జోదుగ రక్తపుటేర్లను పారించిన ధీరమును
విప్పారిన మోముతో చక్తితవై నువ్వు వీక్షించలేదా?
అటువంటి అసమానశూరుడా మాయలేడి బారిన పడి అశువులు బాయునది?

అన్నగారి వెంటే సర్వ సుఖములను
తృణప్రాయాముగా తలచి త్యజించినవాడిని
పతి ధర్మము కన్న సేవా ధర్మమే మిన్నని
కానలలో మీ దారిని తన కంట కాచిన సౌమిత్రిని
నీ కన్నబిడ్డవలె నువ్వు సదా సాకలేదా?
అటువంటి మరిదినా నువ్వు అన్నగారి స్థానముపై ఆశ పెంచుకుంటివని ఆరోపించినది?

కాకరాయని తెంపరితనము నువు చూడలేదా?
శూర్ఫణక క్రోధమును చవిచూడలేదా?
జనస్థానమున ఆగడములు నీకు అగుపడలెదా?
అసురుల కుతంత్రములు నీ తెలివి తర్కించలేదా?
గుండెలు పిండు భవతీ భిక్షాందేహీ పిలుపున
గీత దాటవద్దన్న మనవి నీ చెవికి సోకనేలేదా?

బంధములో భయము ఒక భాగము
వీరతనములో విపత్తు అవిభాజ్యము
ప్రమోదములో ప్రమాదము మమేకము
అనురాగముకు ఆపద, ఆప్యాయతకు అభద్రతలు నిత్య అనుచరులు
సప్తవర్ణాలదీ ప్రేమ వింత పోకడల చిరునామా

No comments: