బంగరు లేడి
మిరుమిట్లు గొలుపు మేని రూపు
కుదురన్నది లేక కదులు చూపు
నిలకడెరుగక ఎగసిపడు మనసు
కన్నదందుకోను ఉరికిపడు వయసు
తృణమంత తిండితో నిండేను ఆకలి
కానలమ్మ వొడిలో తీరేను తనివి
చింతలన్నవి లేక చెంగుమను జోరు
చిరుచప్పుళ్ళకు కూడ బెంబేల బేజారు
కౄరత్వము నడుమ కదలాడు లాలిత్యము
మిసిమి రంగుల మెరిసిపడు మైథిలీ హరిణము
అంశ ఎత్తినది మనిషిదే అయినా
దైవత్వ ఛాయలందులో లేకపోలేవు
వీరాంగములెత్తినా కదపలేని విల్లు
వ్రేళ్ళతో అలవోకగ జరిపిన కధలు కలవు
మానవులకు సహజాతములైన ఈర్షాసూయలు
మచ్చుకన్నవి కూడా ఎక్కడా కాననేరావు
మామూలు మనుషులోపలేని బాధల బరువును
చిరునవ్వు ఊతాన చిటికెలో తలకెత్తుకోగలదు
అయినా పసిడిపై స్త్రీసహజమైన మమకారము
మహలక్ష్మి అయిఉండి పోనిచ్చుకున్నదికాదు
పర్ణశాలలో ఎదుట జింకలెన్ని ఉన్నా
మిసిమి మిసమిసలకు మనసు చెదిరిపోయేను
మనుషులైన కాని దైవాంశ సంభూతులు గాని
అందమను మాయాబంధనము నుండి తప్పించుకో వశమే!
1 comment:
పజ్జం చాలా చక్కగా కుదిర్చారు. హాయిని, ఆనందాన్నీ ఇవ్వటంతో పాటూ, గిలిగింతలుకూడా పెట్టింది.
Post a Comment