వినాయక చవితివిఘ్నపతి


కదన రంగమందు కదను తొక్కలేని కురచ రూపము
మదన మర్దనునికి ఎదురుచెప్పలేని బుడత ప్రాయము
అయినా...అమ్మ ఆననే సేన చేసుకున్న మొండి ధైర్యము
తండ్రి గర్జననే లెక్క చేయని మొక్కవోనితనము
తెగువునకు మూల స్థంభము కండా? గుండే?
తోడబుట్టుతో సరిజోదుగ నిలువలేని స్థూలతనము
తీర్థములలో సరిగంగలాడలేని మందగమనము
అయినా...అవరోధమును అనుగ్రహముతో అధిగమించగలనన్న గట్టి నమ్మకము
పరమాత్మను పరిమితులతో ప్రసన్ను చేసుకొనగల్గు చాకచక్యము
గెలుపునకు మూల మంత్రము శక్తా? యుక్తా?
తల కాళ్ళ పడలేడు చేత వసుధనంటలేడు
కళ్ళ అందమును పలింకించలేడు మేన ఒయ్యారమును ఒలికించలేడు
అయినా...అదిదంపతుల తాండవమునకు తాళందించువాడు
నాట్య శాస్త్రమును అంగభంగిమలన పలికించువాడు
సాధనుకు ప్రధమ సూత్రము నేర్పా? ఓర్పా?
చేతగాని పని చేయనందు వలననే గాక
చేయలేని తననుమున కాదన్న గీతి
ఓటమి ఎదురుపడి పరిహసించినా
నీరసించిపోక ఎదురొడ్డమన్న స్ఫూర్తి
సదా మననము చేసుకొనమను చవితి నీతి

No comments: