వినాయక చవితి



ఆదర్శం

శూరమ్ముతో శూలి నెదిరించు నాడు
వెన్నుచూపక నిలుచు వీరమ్మును నేర్పె
తలకు మించినదని తలపోసిన నాడు
మితులలో మెలుగు వినమ్రతను నేర్పె
దారులన్నీ మరుగై దిక్కుతోచని నాడు
భక్తితో బలపడు నమ్మకమును నేర్పె
వేగమ్ముతో వెతలను నెగ్గలేని నాడు
నిదానమున చక్కబెట్టు చాతుర్యమును నేర్పె
తమ్మునోడించి విజయము దక్కించుకొను నాడు
వ్యూహ రచన యందు బుద్ధి కౌశల్యమును నేర్పె
విఘ్నాధిపతిగా మన్నల నందుకొనిన నాడు
పరిస్థితులకు వెరవని పట్టుదలను నేర్పె

శ్రమతోటి సిద్ధిని సాధించుకున్న నిన్ను
చెమటోడ్పించకే చేర్చమని కోరను నేను
పని యందు ప్రాణమునే పణముగా పెట్టిన నిన్ను
ఆదరించి అందలము అందించమని అడగను నేను
దేవువయినా దైవత్వమునంద పాటుపడిన నిన్ను
దైనందినమున దారిచూపమంటూ వేడను నేను
కష్టించుటకు కండ తర్కించుటకు తెలివి
ఈ రెండు చాలు కృతఙ్ఞుడనై ఉండేను నేను
నీ స్ఫూర్తి చెంది నీ బాట నంటి
నిన్ను తెలుసుకోను ఇక నడవ గలవాడను నేను


1 comment:

Sastry said...

Kanchi- chaala chakkaga rasaavu.