ఆది దంపతులు
చండ్ర నిప్పులు చిమ్ము వెలుగు పండును సిగను గట్టి
ధరకు ధార గట్టిన స్వేదగంగను జటను జుట్టి
బక్క చిక్కిన బసవడికి ముక్కు పగ్గము వేసి
రాలు కరగించు చేతితో ములుగు దండంబు బట్టి
ఎముక దేలిన గూడును పూస దండగ గూర్చి
బూది అంటిన వంటికి జీర్ణ వస్త్రమును కప్పి
గుటక పడని నిజములను గుండెజారక నిలిపి
బీటలేసిన భూమిలో జోగి భూషలో తిరుగాడు
కాల చక్రమును నమ్ముకున్న కర్మ యోగి వాడు
ఆ-కలి పిశాచ మూకల విశృంఖల నృత్యాలను
చిద్విలాసమున తిలకించు భూత వైద్యుడు వాడు
చేయి చాచిన జగతికి సర్వమూ దోపెట్టి
చేత చిప్ప మిగిలిన పిచ్చి బిచ్చగాడు
మింట మండు భానుడి ప్రచండ తీక్షణకు
దీటుగా వెలిగె ఎర్ర బారిన మోముపై పొద్దు గుంకని బొట్టు
కండ కరింగించు మగని మెడమోపు నాగలికి
జోడుగా మెరిసె బండ బారిన చేతులో పదును తేలిన కొడవలి
దున్ను వేళ దన్నుగా నాట్లలో పాట్లుగా పంటలో జంటగా
తోడుగా నిలిచె అన్ని పనులలో అందిపుచ్చుకున్న అర్ధనారీశ్వరి
ప్రకృతి ప్రతి పూత పతికి కూడా అద్దించుకుని
పశుపతి ప్రసన్నతకై పరితపించెడు అపర్ణలా
చేతికంది వచ్చినదంత తన చేతి చలువగా ఎంచు
కాశికేసుకుని సైతం కనికరించు అపర అన్నపూర్ణలా
నాగరికతను ప్రగతిపధాన నడిపించు జగన్నాధ రధ చక్రాలు
ప్రపంచమునకు తమ శ్రమతో ప్రాణభిక్ష పెట్టు ఆది దంపతులు
No comments:
Post a Comment