దీపావళి

 జ్యోతిర్గమయ


కొలిమిలా రగిలే కాంక్ష

వెలుగులా పంచే దీక్ష

నిప్పులా మండే తీక్షణ

సూదిలా గుచ్చే సూక్ష్మత

చిచ్చులా పెరిగే తీవ్రత

మంచులా బిగిసే సాంద్రత

గాలిలా వ్యాపించే గళం 

పువ్వులా వికసించే గుణం

చీకటి పరివారాలను పోకార్చే

ఙ్ఞాన జ్యోతి పరికరాలు ఇవి


జువ్వలా నింగిని తాకే తెగువ

గువ్వలా చొచ్చుకు పోయే చొరవ

అంటుకున్న ఔటులోని విస్ఫోటనా శక్తి

పాకిపోయే పాములోని పర్యటనాసక్తి

దుడుకు మందుగుండు దూకుడు నైజం

చిచ్చర బుడ్డిలోని చెలరేగు తేజం

చక్రభ్రమణకున్న చెరగని నగవు

కూర్చిన మతాబులోని సడలని బిగువు

వెలుగు రేకపై స్వారీ చేయు కాంతి కణం

దిక్కులు దిగంతాలు దాటు నిశ్చయం


పత్తి వత్తు కట్టుకున్న నిండు పతివ్రత

తలకింత చమురు పెట్టుకున్న చిన్న పిల్ల

తలవాకిటన ఇంటి కీర్తిని వల్లించు వందిమాగధి

వరసలో నిలబెడితే అమ్మలక్కతో వరస కలుపు మాటకారి

వెలిగించి వదిలితే అలుపెరగక సాగిపోవు పనిమంతురాలు 

నక్కి ఉన్న చీకటిని దరి చేరనీయని కరకు కాపలాదారు

కన్న ఇంటికి కళని సంతరించి పెట్టు కన్న కూతురు

పుట్టినింటి మీద క్రీనీడ పడనీయని మానధని

గాలిలో రెపరెపలాడిపోతూ తుది శ్వాస వరకు

తిమిరముపై సమరము ఆపని చిన్న ప్రమిద

No comments: