నవరాత్రి

 తుల



పురుషునికి ప్రసాదించిన శారీరిక శక్తి
పక్షపాతి ప్రకృతి స్త్రీకి ఎందుకో సమకూర్చలేదు
పాపమునకు పుణ్యము కర్మమునకు ఫలము రోగమునకు వైద్యము మున్నగు అన్నిటా
సమతుల్యమును పాటించిన సృష్టి ఈ సమీకరణపై యెందుకో శీతకన్ను వేసె
బహుశ సమూహ జీవ సిద్ధాంతములో మనుగడకు మూలసూత్రములు
ఒకే చోట ఉందరాదన్న సంతులన నియమావళి వలన కాబోలు
ప్రాణమంకురించు పాత్రనొక వైపు పెట్టి
ప్రాకారముగ కండసిరిని దాని చుట్టుగ చేసి
ఒక దాని అవసరము మరొక దానితో తీరునట్టు
నిలిపిన నియతి యత్ భావం తత్ భవతి

బలము బలుపు చూసుకుని జీవ మూలములకే ఎసరు పెడితే
క్షేత్ర సారము స్రుక్కి మొలక మొలవని మరుభూమిగా మారి
మనిషి ఉనికికే ప్రమాదము వచ్చు వైపరీత్యము పుట్టు
అండ నిలవ వలసిన కండే మితులు తెంచుకుని తెగబడితే
కరుణ పొంగిన చోటే కార్పణ్యము రేగి
రక్తము పంచిన స్థానే ఆ రుధిరమునే తాగు దాహార్తి పుట్టు
మనిషి లక్షణములు మృగ్యమై మృగములై వర్తిస్తే
మాతృత్వము చాటై మృత్యువావతరముగ చేటై
పెంచిన మమకారము చోటే నిర్జించు యమకారము పుట్టు
ఈ నవమాసాల ఎరుకే నవరాత్రుల వెనుక యత్ భావం తత్ భక్తి

ఆరోగ్యమును అస్థిరపరుచు రోగకంటకములను
ఎదుర్కొనెడు సామర్థ్యమను శరీరమే సమకూర్చుకొనును
లింగ సమతుల్యమును దెబ్బతీయు దౌష్ట్యమునకు
తిప్పికొట్టెడు సాధనములను సమాజమే అందచేయును
వ్యాఘ్ర లక్షణమైన సహనమే వేళ చూచి విరుచుకుపడును
గడ్డి పోచలనుకున్న అబలమే పేనుకుని బంధములు వేయును
సమిష్టి తత్వముతో రక్తకణముల వలె రోగమంతమొందించును
మంచినెంచు మానవీయములే రక్ష కవచములై నిలుచును
బలముకూ శక్తికీ నడుమగల సన్నని వ్యత్యాసమును
సోదాహరణముగా తెలిపెడీ యత్ భావం తత్ శక్తి

No comments: