బహురూపి
పీఠమెక్కిన పిదపనే లేని కొమ్ములు ఎచ్చట నుండి మొలుస్తాయో
పదవులొచ్చిన వెంటనే పలుకులో బుసలు ఎందుకు వెలువడుతాయో
గద్దెనెక్కిన గర్వముతో విర్రవీగి పాలితులను పీడిస్తే
బలము శాశ్వతము అన్న భావనలో ప్రజలను పాలిస్తే
బక్కచిక్కిన చేతులు పేనుకుని అధికారమును కిందకీడుస్తాయి
స్వల్పమనుకున్న శక్తులు పూనుకుని కార్పణ్యమును కాలరాస్తాయి
మగాడు అనగానే లేని మదము ఎందుకు పొడుచుకుని వస్తుందో
మృగాల మాదిరి ఎందుకు వెంటబడి వేటాడలి అనిపిస్తుందో
మనిషికున్న ఇంగితము మరిచి మహిషమల్లె వర్తిస్తే
పురుషడన్న పొగరుతో పడతులెడ ఉచ్ఛనీచములు మరిస్తే
కొత్త జన్మ ఇచ్చుటలో తన పంచ ప్రాణాలు ప్రోది చేసుకొను స్త్రీ
మృగాళ్ళను మట్టుపెట్టుటకు సైతం సకల శక్తులూ సమీకరించుకుంటుంది
సహనమే శక్తిగా దశకంఠుని దరికి చేరనీయని సీతగా
ప్రతీకారమే బలముగా దుర్యోధనుని మట్టికరిపించిన ద్రౌపదిగా
రాజన్న మగవాడే అన్న పురుషాధిక్యతను ప్రశ్నించిన రుద్రమగా
చంటిబిడ్డను చెంగునకట్టి యుద్ధరంగమున చెలరేగిన ఝాన్సీలక్ష్మీగా
తల్లిగా బిడ్డకై తల్లడిల్లు సబలే సందర్భము వస్తే శక్తిగా రూపు మార్చగలదు
మహిషమల్లే రంకేలేయు మదమును ముకుతాడు వేయు యమునిగ రూపుమాపగలదు
No comments:
Post a Comment